1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల
2 బోధలయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
3 "ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుచు, సత్య విషయమై అనుభవ జ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలెనని చెప్పుచుందురు."
4 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన యెడల ఏదియు నిషేధింపదగినది గాదు.
5 ఏలయనగా అది దేవుని వాక్యమువలనను ప్రార్థనవలనను పవిత్రపరచబడుచున్నది.
6 "ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు, క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై యుందువు."
7 "అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము."
8 "శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను, రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోను ప్రయోజనకరమగును."
9 ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై యున్నది.
10 "మనుష్యులందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటు పడుచున్నాము."
11 ఈ సంగతుల నాజ్ఞాపించి బోధించుము.
12 "నీ యౌవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము."
13 "నేను వచ్చువరకు చదువుట యందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము."
14 పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము.
15 "నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసుకొనుము."
16 "నిన్ను గూర్చియు, నీ బోధను గూర్చియు జాగ్రత్తగలిగియుండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు." |