1 "మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును"
2 రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.
3 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది.
4 ఆయన మనుష్యులందరు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారైయుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.
5 "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు నొక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు."
6 ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలములందు ఇయ్యబడును.
7 "ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపొస్తలుడను గాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడానుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు."
8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయువలెనని కోరుచున్నాను.
9 "మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియుగలవారై యుండి, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించు కొనక,"
10 దైవభక్తిగల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
11 స్త్రీలు మౌనముగా నుండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.
12 స్త్రీ మౌనముగా నుండవలసినదేగాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైను ఆమెకు సెలవియ్యను.
13 మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
14 "మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను."
15 అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా నుండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. |