1 "సహోదరులారా, ఆ కాలములను గూర్చియైనను, ఆ సమయములను గూర్చియైనను మీకు వ్రాయనక్కర లేదు."
2 రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
3 "లోకులు-నెమ్మదిగా ఉన్నది భయమేమియు లేదని చెప్పుకొను చుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్ధించును గనుక వారెంత మాత్రమును తప్పించు కొనలేరు."
4 "సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు."
5 "మీరందరు వెలుగు సంబంధులును, పగటి సంబంధులునై యున్నారు. మనము రాత్రివారము కాము, చీకటివారము కాము."
6 కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము.
7 "నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు."
8 "మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము."
9 "ఎందుకనగా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింప లేదు."
10 మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతో కూడ జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతినొందెను.
11 కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకని నొకడు ఆదరించి యొకని కొకు క్షేమాభివృద్ధి కలుగ జేయుడి.
12 "మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువు నందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి,"
13 వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము? మరియు ఒకనితో నొకడు సమాధానముగా వుండుడి.
14 "సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా- అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనియ్యడి. అందరియెడల దీర్ఘ శాంతము గలవారై యుండుడి."
15 ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడల ఎల్లప్పుడును మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి.
16 ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి.
17 ఎడతెగక ప్రార్థన చేయుడి.
18 "ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము."
19 "ఆత్మను ఆర్పకుడి,"
20 "ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి,"
21 సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి.
22 కీడుగా కనబడు ప్రతిదానికి దూరముగా నుండుడి.
23 "సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక."
24 మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.
25 "సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి."
26 పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
27 సహోదరులందరికిని ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేరట మీకు ఆనబెట్టుచున్నాను.
28 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. |